చంద్రబాబు కాలేజ్ డేస్, ప్యూర్లీ పర్సనల్్ విషయాలు !
హైదరాబాద్, అక్టోబర్ 15 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలిసిందెంత!? అసలేం తెలీదంటారా... అయితే గురువారం ఆంధ్రజ్యోతి-ఏబిఎన్ ఛానెల్‌లో ప్రసారమైన 'ఇన్‌సైడర్' కార్యక్రమంలో చంద్రబాబు చెప్పిన విస్మయకర విషయాలు చూసి తీరవలసింది. సాక్షాత్తూ ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణ దాదాపు గంటన్నర సేపు చంద్రబాబును ఇంటర్వ్యూ చేసి ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఎప్పుడూ గంభీరంగా, గుంభనంగా ఉండే చంద్రబాబు ఇన్‌సైడర్ కార్యక్రమంలో తన గత స్మృతులను తట్టి లేపారు. అచ్చంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనముందు ఉంచారు. తన చిన్నతనంలో ఆడుకున్న ఆటల దగ్గర నుంచి కాలేజీ డేస్, పెళ్ళి, రాజకీయ జీవితం వరకూ ఎవరికీ తెలియని ఎన్నో సంఘటనలను ఆయనే స్వయంగా వెల్లడించారు. క్యాంపస్‌లో గ్యాంగ్‌వార్లు, సైకిల్‌షాప్‌లో మీటింగ్‌లు, అమ్మాయిలను మనసులోనే ఇష్టపడినా బయటకు చెప్పకపోవడం, ఛాయ్ తాగుతూ వీధుల్లో బలాదూర్‌గా తిరగడం, బైక్ సైలెన్సర్ ఊడబీకి అమ్మాయిలకు కటింగ్ ఇవ్వడం, బాతాఖానీలు, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, వైఎస్‌తో స్నేహం, భువనేశ్వరితో పెళ్ళి, పెళ్ళికి ముందు వారేం మాట్లాడుకున్నారు, పెళ్ళి తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో చిలిపి తగాదాలు, చిన్నచిన్న వివాదాలు, కుమారుడితో అనుబంధం, ఎన్టీఆర్‌ను మొదట ఎప్పుడు కలిసిందీ, ఆయనతో తన అనుబంధం, 1994 ఆగస్టు సంక్షోభం, ముఖ్యమంత్రిగా తనకు కలుపుగోలు తనం లేదని సోదాహరణంగా వివరించడం వంటి ఎన్నెన్నో అంశాలు స్వయంగా బాబు నోటి వెంట ఉల్లాసంగా జాలువారాయి.
చంద్రబాబు చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు :
* మాది చిత్తూరు జిల్లాలో ఓ కుగ్రామం నారావారిపల్లె. నాన్నతో కలిసి చిన్నప్పుడు నాగలి పట్టుకుని పొలం వెళ్ళేవాడిని. ఇంటికి పొలం ఎంతో దూరం. నాన్న ఆ పనులు వద్దన్నా ఏదో తెలీని ఉత్సాహంతో చేసేవాడిని. నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం.
* పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళి ప్రాథమిక విద్య అభ్యసించే వాడిని. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా కలిసి ఆడుకుంటూ వెళ్ళేవాడిని. ఆ తర్వాత సైకిల్ కొనుక్కుని వాటి మీద జామ్ అంటూ వెళ్ళడం, అదొక సరదా.
* తొమ్మిదో తరగతి దాకా చంద్రగిరిలో చదివాను. అప్పుడు ఇంట్లో ముసలివాళ్ళు అక్కడ ఉండి నాకు ఒండి పెట్టేవారు.
* పదవ తరగతి తిరుపతిలో చదివాను. ఆ తరువాత పియుసి నుంచి ఆర్ట్స్ కాలేజీలో నా రాజకీయ ప్రస్థానం మొదలయింది.
* క్లాసుల్లో బాగా అల్లరిచేసే వాళ్ళం. అసలు క్లాసులకు వెళ్ళేవాళ్ళం కాదు. ఎగ్జామ్స్ అప్పుడు 30-40 రోజులు మాత్రం కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించేవాడిని.
* క్యాంపస్‌లోనే చిన్నసైకిల్ బంక్ ఉండేది. అక్కడ చేరి గుంపుగా కూర్చుని రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళం. క్లాసులు బంక్ కొట్టి తిరుపతి వీధుల్లో తిరిగేవాళ్ళం. ఛాయ్ తాగుతూ మధ్యాహ్నం రెండు గంటలు, సాయంత్రం గంట తిరిగేవాడిని.
* వైఎస్‌తో నా అనుబంధం ప్రత్యేకం. ఇతరులకు ఈర్ష్య కలిగినట్లు ఉండేవాళ్ళం. విద్యార్ధి రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. క్యాంపస్‌లో బ్యాచ్‌లుండేవి. హాస్టల్‌లో ఓ బ్యాచ్ వచ్చి మా వాళ్ళని కొడితే మేమూ వెళ్ళేవాళ్ళం. అలా గొడవలు, బైక్ రేసులు, అమ్మాయిలను మనుసులోనే ఇష్టపడుతూ బయటకు వ్యక్తం చేయని ఫీలింగ్స్‌తో కాలేజీ డేస్ గడిచిపోయాయి.
* డైరెక్టుగా క్యాంపస్ నుంచే ఎన్నికల్లో పోటీ చేశా. జనతా ప్రభంజనంలో కాంగ్రెస్ నుంచి చిత్తూరు జిల్లా నుంచి గెలిచిన ముగ్గురిలో నేనొక్కడిని. చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచా
* ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రాఫర్ మంత్రినయ్యా
* నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. ఆయనను తొలిసారిగా అనురాగదేవత సినిమా షూటింగ్ జరుగుతుండగా చూశాను. అప్పుడు శ్రీదేవితో పెళ్ళిని షూట్ చేస్తున్నారు. నేను మంత్రినన్న ఇదితో ఆయన నన్ను అభిమానంగా పలకరించారు. ఇంత చిన్న వయసులో ఈ స్థాయికి ఎదిగినందుకు అభినందించారు.
* సినిమాటోగ్రాఫ్ మంత్రిగా తరచూ ఆయన ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ఆయన పెద్ద కుమారుడు జయకృష్ణ అప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవాడు. ఎన్టీఆర్ లేకపోతే ఆయనను కలవాలని చెప్పి, వస్తే ఇన్‌ఫార్మ్ చెయ్యమని చెప్పేవాడిని. అలా మా మధ్య పరిచయం పెరిగింది. అప్పుడు భువనేశ్వరి చదువుతూ ఉండేది.
* జయకృష్ణే ముందు భువనేశ్వరితో పెళ్ళి ప్రపోజల్ తీసుకొచ్చాడు. అయిదారు రోజులు ఆగిన తర్వాత పెద్దల తర్జన భర్జనల తర్వాత పెళ్ళికి ఓకే చెప్పాం.
పెళ్ళిచూపుల్లో భువనేశ్వరిలో 15-30 నిమిషాలు మాట్లాడి ఉంటాను. నేను ఆర్డినరీ కుటుంబంలో నుంచి వచ్చానని చాలా విషయాలు ఆమెకు అప్పుడే వివరించి చెబితే సహృదయంతో నన్ను అర్థం చేసుకుంది.
* ఆ తర్వాత రెండు నెలలకు పెళ్ళి జరిగింది. ఈ మధ్యలో మేమెప్పుడూ మాట్లాడుకోలేదు.
* ఆ తర్వాత మద్రాసులో మా పెళ్ళి జరిగింది. చిత్తూరు జిల్లా మొత్తం తరలి రావడంతో ఏర్పాటు చేయలేక వారిని తిప్ప పంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* అన్ని కుటుంబాల్లో లాగానే భువనేశ్వరితో అప్పుడప్పుడూ చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి. ముఖ్యంగా టైమ్ మేనేజ్‌మెంట్. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో తనకోసం నేను ప్రత్యేకంగా వ్యక్తిగత జీవితం కేటాయించే సమయం ఉండేది కాదు. బాబును కూడా చాలా మిస్సయ్యా.
* అత్తగారు ఎంత పోరుపెట్టినా వద్దనుకుని ఒక బాబుతోటే సరిపెట్టుకున్నాం.
* ఎన్టీఆర్‌తో క్రమంగా నా అనుబంధం పెరిగింది. ఆయన పార్టీ పెడితే నేను దన్నుగా నిలిచాను. అందుకే 1985లో పోటీ చేయలేదు. 1999లో విమర్శలను తట్టుకోలేక పోటీ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కథ తెలిసిందే.
* ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా దింపవలసి రావడం ఎంతో బాధాకరమైన విషయం. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించాను. మధ్యలో భువనేశ్వరి ఎంతో నలిగిపోయింది.
* కుమారుడు లోకేష్ భారతీయ విద్యా భవన్, లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో చదివాడు. చిన్నప్పటి నుంచి తనని ఓ మంచి సిటిజన్‌గా తయారు చెయ్యాలన్న తపన వల్ల, క్రమశిక్షణ నేర్పడం వల్ల స్టాన్‌ఫర్డ్‌లో సీటు సాధించగలిగాడు. హి వజ్ ఎ మెరిట్ స్టూడెంట్. నేను ఎప్పుడూ క్లాసులో రెండో స్థానంలోనే ఉండేవాడిని.
* బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో లోకేష్ వివాహం ఆలోచన మొదట నాకే వచ్చింది. కాకపోతే అమ్మాయి చదువుకుంటుందని కొన్నేళ్లు వాయిదా వేసుకున్నాం.
* 1999 ఎన్నికల తర్వాత సొంత మనుషులను సంప్రదించకపోవడం తప్పే. అందర్నీ కలుపుకుని పోవాలన్న ఆలోచన కంటే, రాత్రికి రాత్రే ఎదో చేసేయాలన్న తపన, పేరు తెచ్చేసుకోవాలన్న తాపత్రయం నన్ను ఒంటరిగా మిగిల్చింది.
* కారణాలు అనేకం. ముఖ్యంగా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం. కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ప్రజలు అర్థం చేసుకుని మళ్ళీ పదవి ఇచ్చినా అదే పంథా అవలంభించాను. అది ప్రజలను కన్విన్స్ చేయలేకపోయింది. నేను మంచే చేశా. కానీ వారికోసం ఇంకో విధంగా వెళ్ళి వుంటే బాగుండేది. ఇప్పుడివన్నీ సమీక్షించుకుంటున్నాం.
* ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేసి నేను చనిపోయాక కూడా నా గురించి ప్రజలు మంచిగా మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇందుకు ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నాను.
|
|
 |
 |
 |
 |
|