ఆంధ్రజ్యోతి-ఎబిన్ ఛానెల్ ప్రారంబించిన రోశయ్య
హైదరాబాద్, అక్టోబర్ 15 : ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్ గురువారం సాయంత్రం 4.48 గంటలకు ప్రారంభమయింది. ముఖ్యమంత్రి రోశయ్య ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఛానెల్ న్యూస్ నెటవర్క్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోం హైకోర్టు చీఫ్ జస్టీస్ చలమయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వక్తలంతా ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి టి.వి. ఛానెల్ ప్రభంజనం ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 15 : వచ్చేసింది. తెలుగు ప్రసార మాధ్యమాల్లో ప్రభంజనం సృష్టించడానికి ఆంధ్రజ్యోతి టి.వి. ఛానెల్ వచ్చేసింది. ప్రజా సమస్యల మాటున తచ్చాడుతున్న అదృశ్య ఛాయను ధైర్యంగా వెలికి తీసేందుకు, రాజకీయ క్రీనీడల మాటున జరుగుతున్న వాస్తవాలను ప్రామాణిక విశ్లేషణతో వెల్లడించేందుకు, ప్రజా ఉద్యమాల గళాన్ని వేయి గొంతుకలతో వినిపించేందుకు... ప్రజల కొరకు, ప్రజల మధ్యకు, ప్రజాపక్షపాతిగా ఉక్కు సంకల్పంతో దూసుకొచ్చింది ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ (ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్). అక్షరాయు ధంతో అవినీతిపై అవిశ్రాంత పోరాటం చేస్తూ, నిజాన్ని నిర్భీతిగా వెలికితీస్తూ, ఎన్నెన్నో సంచలన కథనాలను వెలువరిస్తూ, దేదీప్యమానంగా వెలుగుతున్న 'ఆంధ్రజ్యోతి' పత్రిక సరికొత్త పుత్రికగా ఈ దృశ్యశ్రవణ మాద్యమం కొత్త పంథాన పదనిర్దేశనం చేేయనున్నది. దిక్కులదిరేటి ధైర్యంతో, పిడుగులు కురిపిస్తూ, మెరుపులు మెరిపిస్తూ, దుమ్ములేపుతూ ఈ దృశ్యశ్రవణ మాద్యమం ఈరోజే గొప్ప ప్రభతో ఉదయించింది. ఇప్పటికే కొన్ని కేబుల్ ఆపరేటర్లు సిగ్నల్‌ను ఇస్తుండగా, మరికొందరు కేబుల్ ఆపరేటర్లు త్వరలోనే సిగ్నల్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.