ఆంధ్రజ్యోతి-ఎబిన్ ఛానెల్ ప్రారంబించిన రోశయ్య
హైదరాబాద్, అక్టోబర్ 15 : ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్ గురువారం సాయంత్రం 4.48 గంటలకు ప్రారంభమయింది. ముఖ్యమంత్రి రోశయ్య ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఛానెల్ న్యూస్ నెటవర్క్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోం హైకోర్టు చీఫ్ జస్టీస్ చలమయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వక్తలంతా ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి-ఎబిన్ ఛానెల్ ప్రారంబించిన రోశయ్య

హైదరాబాద్, అక్టోబర్ 15 : ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్ గురువారం సాయంత్రం 4.48 గంటలకు ప్రారంభమయింది. ముఖ్యమంత్రి రోశయ్య ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఛానెల్ న్యూస్ నెటవర్క్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోం హైకోర్టు చీఫ్ జస్టీస్ చలమయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వక్తలంతా ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోశయ్య మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్ సక్సెస్ కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచంలో దినపత్రికలు, సినిమాలు, చానెల్స్ మధ్య పోటీతత్వం బాగా పెరిగిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి నుంచి ఛానెల్ రావడం నిజంగా సాహసమేనని ఆయనన్నారు. అయితే పత్రికను నడిపి విజయవంతమైన రాధాకృష్ణ (ఎండి) ఛానెల్‌ను కూడా దిగ్విజయంగా నిర్వహిస్తారని భావిస్తున్నామని తెలిపారు. గుంటూరులో చదువుకునే రోజుల్లో పత్రికా రంగంలో మొత్తం స్వాతంత్య్ర సమరయోధులు, జైలుకు వెళ్ళి వచ్చిన వారే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఒక పత్రికలో పనిచేసే జర్నలిస్టుతో తనకు జరిగిన సంభాషణ వివరాలను రోశయ్య వెల్లడించారు. నిజంగా అప్పట్లో జైలుకు వెళ్ళి వచ్చారంటే ప్రజల్లో ఎంతో గౌరవం ఉండేదని, వార్తా సేకరణ కోసం, నిజాయితీ కోసం ప్రాణమిచ్చే వారని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పెను మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఇందుకు సంబంధించి తనదైన శైలిలో కొన్ని ఉదాహరణలు చెప్పి, కాబట్టి వార్తను వార్తగా, వ్యాఖ్యానాల్ని వేరుగా ప్రసారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వార్తలో ప్రామాణికత పాటించాలని కోరారు.

ఆ తరువాత చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ న్యూస్ నెటవర్క్‌ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడేళ్ళ క్రితం పూర్తిగా పతనమైన పత్రికను సవాల్‌గా తీసుకుని విజయం సాధించిన రాధాకృష్ణ ఈ ఛానెల్‌ను కూడా సక్సెస్ చేస్తారనే విషయంలో తనకు ఎలాంటి అపనమ్మకమూ లేదని ఆయన అన్నారు. సమర్థవంతమైన నాయకత్వంలో ఉన్న ఏ రంగమైనా, పోటీ తత్వాన్ని ఎదుర్కొంటే విజయం సాధిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే ఛానెల్స్‌లో విలువల గురించి కొద్దిగా ఆలోచించాల్సి ఉందని, అంతిమంగా ఏ విషయమైనా ప్రజలే తీర్పు చెబుతారు కాబట్టి వాస్తవాలను నిక్కచ్చిగా తెలియజేసే విధంగా సిబ్బంది పనిచేయాలని కోరారు. అభివృద్ధి ఫలాలను పేదలందరికీ సమానంగా పంచే నవ సమాజ నిర్మాణంలో రాజకీయ, న్యాయ వ్యవస్థతో పాటు మీడియా కూడా మంచి పాత్ర పోషించాలని చంద్రబాబు కోరారు. అయితే ఈ వ్యవస్థలన్నీ ఒకదానికొటి సమన్వయం చేసుకుని అంతిమంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, ఒకరిపై ఒకరు బురద జల్లుకోరాదని, ముఖ్యంగా మీడియాపై కక్ష సాధింపు చర్యలు కూడదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్నారు.